Thursday, November 15, 2012

ఏమిటి ఆయనే ఉంటే ...?



భర్త చనిపోతే భార్య బొట్టు, పూలు, ఆభరణాలను త్యజించడంతో పాటు నెత్తిమీది జుట్టును కూడా తీసేయడం సంప్రదాయం. పూర్వం ఈ ఆచారాన్ని ఎంతో కచ్చితంగా పాటించేవారు. భర్త చనిపోయాక ఆ స్త్రీలు ఇక జీవితంలో జుట్టు పెంచుకునేవారు కాదు. కాస్త పెరగగానే తీయించేసుకునేవారు. అయితే ప్రతిసారీ క్షురకుడి దగ్గరకు వెళ్లలేక, ఎవరితోనైనా కబురు చేసి ఇంటికే రప్పించుకునేవారు.

ఓసారి ఒక వితంతువు పెరిగిన తన జుట్టును తీయించేసుకోవాలనుకుంది. ఎవరైనా చిన్నపిల్లాడితో క్షురకుడికి కబురు చేద్దామని అంతా వెతికింది. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చివరికి విసిగిపోయిన ఆమె- ‘అదే నా మొగుడు బతికుంటేనా, వెళ్లి పిలుచుకొచ్చేవాడు కదా’ అంటూ వాపోయింది. అది విన్నవారంతా, నీ మొగుడే ఉంటే అసలు నీకు గుండు చేయించుకోవాల్సిన అవసరమేమొచ్చింది అన్నారు ఆమె మతిమరుపును చూసి నవ్వుకుంటూ. నాటి నుంచీ ఇది వాడుకలోకి వచ్చింది. 

No comments:

Post a Comment